వ్లదీమర్ నబొకొవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"వ్లాడిమర్ నబొకొవ్ "
జననంఏప్రిల్ 22, 1899
సయింట్ పీటర్స్బర్గ్
మరణంజూలై 2, 1977(aged 78)
మొంట్రెక్స్, స్విట్జర్లాండ్
జాతీయతరష్యన్, అమెరికన్, స్విస్
రాజకీయ ఉద్యమంModernism, postmodernism

వ్లాడిమర్ నబొకొవ్ లేదా వ్లాడిమర్ నబొకొఫ్ ప్రముఖ నవలా రచయిత, కవి, జీవశాస్త్రం అధ్యాపకుడు.

బాల్యం- యౌవ్వనం

[మార్చు]

నబొకొవ్ 1899 ఏప్రల్ 22వ తేదీన సెంట్ పీటర్స్బర్గ్ లో ఒక కులీన కుటుంబంలో జన్మించాడు. భోగభాగ్యాలతో, చదువు సంస్కారాలతో పూర్వంనుంచీ రాజ్యవయవహారాల్లో ప్రముఖపాత్ర వహించిన కుటుంబం కావటంతో నబొకొవ్ బాల్యమునుంచీ పాశ్చాత్య (ఇంగ్లీషు, ఫ్రెంచ్) సంస్కృతి ప్రభావంలో పెరిగాడు. ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాంసు, ఇంగ్లాండు దేశాల్లో తల్లిదండ్రులతో విలాసయాత్రలు చేసి వస్తూండటమే కాదు, చిన్నతనమునుంచి ఇంగ్లీషు నర్సులు, గవర్నెస్ లు నబొకొవ్ కు ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్ నేర్పేవారు. నబొకొవ్ కు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లిళ్ళు.ఆదర్సప్రాయులైన తల్లితండ్రులు.నబొకొవ్ వ్రాసిన స్వీయచరిత్రలో (స్పీక్, మెమొరీ) లో తన బాల్యాన్నీ, యౌవన ప్రధమావస్థ అనుభవాల్నీ విపులంగా చిత్రించడంలో ఆతని తల్లితండ్రులు ఇచ్చిన స్వేఛ్చాపూరితమైన వాతావరణంలో పెరిగానని వ్రాసుకొన్నాడు.వనాల్లో అడవుల్లో సీతాకోకచిలుకల్ని వెంటాడి పట్టుకొని రకరకాల జాతుల్నీ సేకరించడం నబొకొవ్ చిన్నతనమ్నుంచీ జీవితాంతం వరకు కొనసాగించిన హాబీ. చివరకాయన అందులో అపారమైన శాస్త్రజ్ఞానం సంపాదించాడు.అమెరికన్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో సీతాకోక చిలుకల్ని గురుంచి ప్రత్యేక విభాగపు ప్రొఫెసర్గా పనిచేసారు.అటువంటి స్వేచ్చా వనవిహారి నబొకొవ్ ఇంచుమించు 11వ యేటనుంచే ఆడపిల్లలతో స్నేహాలు,వారిపట్ల ప్రత్యేక ఆకర్షణా అనురాగం పెంపొందిచుకోవడం జరిగింది.15వ యేట కవిత్వం, ఇంగ్లీషు కవిత్వం అల్లడం ప్రారంభించాడు. అదంతా ప్రేమ కవిత్వమే. 16వ యేట తమారా అనే పదిహేనేళ్ళ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. తల్లికి నబొకొవ్ చేష్టలు అన్నీ తెలుసు. కాని ఎక్కడ ఎప్పుడు మందలించాలో కూడా తెలుసు అని రాసుకున్నాడు నబొకొవ్. తండ్రి జార్ చక్రవర్తి నిరంకుశ పరిపాలనలో లిబరల్ మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది, రచయిత. 1914లో సైన్యంలో చేరి 1917–18 లో రాజ్యాంగ సభకు ఎన్నుకోబడి, బోల్షెనిక విప్లవకారులచే అరస్టు చేయబడి లిబరల్ అయిన భూస్వామి వర్గానికి చెందినవాడు కావడంవల్ల 1919లో ప్రవాసియై, 1922లో బెర్లిన్ లో ఉపన్యసిస్తూ ఇద్దరు రష్యన్ ఫాసిస్ట్ ల చేతిలో హత్య చేయబడ్డాడు.తండ్రి స్వచ్చంద ప్రవృత్తీ, సచ్చీలము స్వేచ్చాప్రియత్వము నబొకొవ్ మీద చెరగని ముద్ర వేశాయి. నిందారోపణము చేయడము, తెగనాడటమూ, జీవితంలో పడ్డా కష్టాలకూ, పోగొట్టుకున్న భోగభాగ్యాలకూ మనః ప్రవృత్తిలో చేదు నింపుకొన్ని దాన్ని నిరంతరము అభివ్యక్తం చేస్తూ ఉండటమూ తండ్రీకొడుకుల ప్రకృతిలో మచ్చుకైనా కానరాదు. 1918లో నబొకొవ్ 19యేళ్ళ ప్రాయంలో రష్యానుంచి ఆతని కుటుంబం అన్నీ వదులుకొని దేశాంతరగతులు అయ్యారు. తన 48వ యేట వ్రాసిన స్వీయ చరిత్ర స్మృతులు (Speak Memory Biography Revisited) గ్రంధంలో ఇలా వ్రాసుకున్నాడు: మళ్ళీ ఆపరిసరాలను ఇప్పుడు దర్సిస్తే ఎట్లా ఉంటుందో నేనూహించుకోలేక పోతున్నాను. దొంగ పాస్ పోర్టుతో వళ్దామా అనిపిస్తుంది ఒక్కోసారి.మారుపేరుతో అలా చేయడం సాధ్యమే. కానీ నేపెట్టకీ అలా చేయలేనేమో!!!.

రచనలు- జీవిత విశేషాలు

[మార్చు]

నబొకొవ్ తన అరవైయేళ్ళ జీవితాన్ని హెగెల్ పద్దతిలో గతి తార్కికంగా విశ్లేషించి-మొదట రష్యాలో గడిపిన 20ఏళ్ళు ధెసిస్ గానూ, పశ్చిమ యూరప్ లో గడిపిన 20ఏళ్ళు ఆంటె థిసిస్ గానూ, అమెరికాలో గడిపిన చివరి 20ఏళ్ళూ సింధెసిస్ గానూ పేర్కొన్నాడు.ఇవి మూడ వలయాలు అంటాడు.లోలిత మొదలైన నవలలు చివరి 20ఏళ్ళ కాలానికి చెందినవి.[1] వీటిలో పరిణితి చెందిన నబొకొవ్ రసానుభూతీ, మేధప్రవృత్తి, ఆయన వ్యక్తిత్వ వైశిష్ట్యపు ముద్రతో కళాఅ స్వరూపాన్ని పొందాయి. లోలిత(Lolita) లో రసానుభూతి ద్వారానూ, పినిన్(Pnin), పేల్ ఫైర్(Pale Fire) నవలల్లో మేధాప్రధానమై ప్రహేళికా రచన ద్వారానూ నబొకొవ్ వాసనా పరంపరనుంచీ విముక్తి మార్గాన్ని అంవేషించి లక్ష్యసిద్ధి పొందాడనడం సత్యదూరం కాదు.

1935లో బెర్లిన్లో ఉంటూ నాజీ వ్యవస్థ రూపొందుతున్న సమయంలో వ్రాసిన నవల పేరు శిరఛ్చేదానికి పిలుపు (Invitation to a Beheading) నబొకొవ్ సాహిత్యం ద్వారా సాగించిన అంవేషణకు ఇది ఒక తార్కాణం.ఇందులోని శిల్పం ఫ్రాంజ్ కాఫ్కా నవలల్ని జ్ఞప్తికి తెస్తుంది. పశ్చిమ యూరప్ లో ఉన్నప్పుడు వ్రాసిన నవల్ నిస్పృహ (Despair). అందులోని నాయకుడు ఒక వ్యాపారస్థుడు. అద్దంలో తన ముఖం తను చూచుకొనేందుకు భయపడే ఈవ్యక్తి మరో వ్యక్తి (దిక్కులేని పెదవాడు) తనకు ప్రతిబింబమని నమ్మి, వాడికి డబ్బు ఆశచూపి, వాణ్ణి హత్యచేసి, తను వాడుగా పారిపోవడం ద్వారా తన సమస్యల నుంచీ విముక్తి పొదే యత్నము చెస్తాడు. ఇది కూడా రష్యన్ భాషలో వ్రాయబడింది. 1965లో ఇంగ్లీషులోనికి తెచ్చినప్పుడు నబొకొవ్ దాన్నే చాలా భాగం మార్చివ్రాసాడు.

నబొకొవ్ ఎప్పుడూ తీవ్ర నిద్రలేమి రోగంతో బాధపడేవాడు. అందుకేనేమో అతనికి నిద్ర అంటే నచ్చదు, నిద్రను మానవుడి మానసిక చిత్రవధ (Mental Torture) గా అభివర్ణించాడు.

నబొకొవ్ తన జీవితపు చివరి దశను మొంట్రాక్స్, స్విట్జర్లాండు లొ గడిపాడు. కొడుకు, భార్య సన్నిధిలో 1977 జూలై 2వ తారీకున తుది శ్వాస విడిచాడు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (6 May 2019). "వ్లాదిమిర్ నబొకొవ్". మామిడి హరికృష్ణ. Archived from the original on 6 May 2019. Retrieved 6 May 2019.
  • 1977 భారతి మాస పత్రిక- వ్యాసము- వ్లాడిమర్ నబొకొఫ్- వ్యాస కర్త:శ్రీ. ఆర్.ఎస్.సుదర్సనం.